పిల్లలను కనలేను అని చెప్పిన భీష్ముడు

మహాభారతం పార్ట్ 2


కొన్ని సంవత్సరాల తర్వాత నదీతీరంలో శాంతనుడు వెళుతుంటే తనకి ఆగకుండా జుమ్ జుమ్ జుమ్ అని శబ్దం వినిపిస్తుంది. ఏంటో అని అటు వైపు వెళ్ళి చూస్తే అక్కడ ఒక 16 ఏళ్ల కుర్రాడు అత్యంత తేజస్సుతో తన బాణంతో నది వైపుకు బాణాలు వేగంగా వేస్తున్నాడు. ఆ వింటినారి శబ్దమే శాంతనుడికి వినిపించిన శబ్దం.




ఆ బాణాలు ఎవరికి వేస్తున్నాడు అని చూస్తే ఆ బాణాలు నదిలో వేసి నదిలో ఒక బ్రిడ్జి ఫామ్ చేసి నదీ ప్రవాహాన్ని ఆపుతున్నాడు. ఆ వీరత్వము చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు కుమారా నువ్వు అని అడిగితే పక్కనుంచి ఒక ఆవిడ వచ్చి నా కుమారుడే అని చెప్తుంది. ఆవిడ ఎవరో కాదు గంగ. అంటే ఈ కుమారుడు శాంతనుడి కుమారుడే తన పేరు దేవవ్రతుడు.

దేవవ్రతుడికి యుద్ధ విద్యలు నేర్పింది పరశురాముడు, తనకు చదువు నేర్పింది వశిష్టుడు. అతను అత్యంత వీరుడు,యోదుడు. నా రాజ్యానికి రాజు, సరైన వారసుడు దొరికాడని అనుకొని దేవవ్రతుడుని శాంతనుడు తన రాజ్యానికి తీసుకెళ్లాడు. దేవవ్రతుడిని రాజ్యానికి రాజును చేశాడు.

కొన్ని రోజుల తర్వాత తన రాజ్యాన్ని చూడడానికి శాంతనుడు బయటికి వెళ్లినప్పుడు ఒక చేపలు పట్టే ఆవిడని చూసి చాలా ఇష్టపడి దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకొని నాకు రాణిలా ఉంటావా అని అడిగాడు. మా నాన్ననే ఈ విషయం అడగండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ చేపలు పట్టే ఆవిడ పేరు సత్యవతి.


సత్యవతి తండ్రి తో తన కూతుర్ని తనకిచ్చి పెళ్ళి చేయమని శాంతనుడు అడిగాడు. దానికి ఆయన నీ కుమారుడు దేవవ్రతుడే రాజ్యానికి రాజు అవుతాడు, నా కూతురు బిడ్డలు రాజు కాలేరు కాబట్టి నేను నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పాడు. దానితో ఆ రోజు నుంచి శాంతనుడు బాధ పడటం మొదలు పెట్టాడు. ఆ బాధతో తన కొడుకుని, రాజ్యాన్ని, ప్రజలను కూడా పట్టించుకోలేదు. తన తండ్రి యొక్క బాధ చూడలేక ఏమైందో అని దేవవ్రతుడు జరిగింది తెలుసుకున్నాడు.

మా నాన్న సంతోషమే నాకు ముఖ్యమనుకొని ఎలాగైనా సత్యవతితో తన తండ్రికి పెళ్లి చేయాలని సత్యవతి తండ్రి వద్దకు వెళ్లి నేను రాజుని అవుతాను అనుకోవడం వల్లే కదా నువ్వు నా తండ్రికి సత్యవతిని ఇవ్వనన్నావు. నేను రాజును అవ్వను, సింహాసనాన్ని అధిరోహించను. నీ కూతురు పిల్లలే రాజు అవుతారు అని దేవవ్రతుడు అన్నాడు. అయినా కూడా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను ఎందుకంటే ఇప్పుడు నువ్వు మీ నాన్న కోసం సింహాసనం వద్దు అని వదిలేయవచ్చు, కానీ నీకు పుట్టే పిల్లలు ఎందుకని సింహాసనం వద్దు అనుకుంటారు, అధికారం వద్దు అని ఎవరు మాత్రం అనుకుంటారు. తర్వాత కొట్టుకొని చస్తారు అందుకని ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని సత్యవతి తండ్రి అన్నాడు.

ఏం చేయాలో తెలియక దేవవ్రతుడు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ భారత దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ప్రతిజ్ఞ భూమిమీద దేవుళ్ళను దించేలా చేసింది. ఆ ప్రతిజ్ఞే భూమి మీద దేవుళ్ళు లేకుండా కూడా చేసింది. ఆ ప్రతిజ్ఞ మహాభారతం అనే కావ్యం అద్భుత కావ్యం అయ్యేలా చేసింది. ఆ ప్రతిజ్ఞ కురుక్షేత్రానికి దారితీసింది.

ఆ ప్రతిజ్ఞ ఏంటంటే దేవవ్రతుడు అనే నేను ఈ ముల్లోకాల సాక్షిగా ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. ఇకనుంచి దేవవ్రతుడుని భీష్ముడు అని పిలుచుకుంటారు.

తర్వాత సత్యవతితో శాంతనుడి పెళ్లయింది. ఆ సంతోషంలో శాంతనుడు భీష్ముని పిలిచి కుమార తండ్రి ఆనందం కోసం కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేశావు. నేను నీకు ఏం చేసినా తక్కువే కానీ ఒక వరం మాత్రం నీకు ఇస్తాను, నీకు చావు అనేది ఎప్పటికీ రాదు నీకు నువ్వుగా ఎప్పుడు చనిపోవాలి అనుకుంటే అప్పుడే నువ్వు చనిపోతావు అని వరం ఇచ్చాడు. దానితో ఇక భీష్ముడికి చావు ఉండదు. తను చనిపోవాలి అనుకున్నప్పుడు తప్ప.

ఇంతలో సత్యవతి గర్భవతి అయింది. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు మగ పిల్లలు పుడతారు. శాంతనుడికి, సత్యవతికి పుట్టిన పిల్లలు కాబట్టి వీరు భీష్ముడికి తమ్ముళ్లు అవుతారు.

చిత్రాంగదుడు అదే పేరుగల ఒక గంధర్వుడి తో యుద్ధం చేస్తున్నప్పుడు చనిపోతాడు. ఇక రాజ్యంలో చివరకు మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్రవీరుడు. కానీ అప్పటికే విచిత్రవీరుడుకి ఆరోగ్యం బాగాలేదు. పట్టాభిషేకం చేసి రాజుని చేశారు. భీముడికి భయం మొదలైంది, ఒకవేళ అనుకోకుండా విచిత్రవీరుడు చనిపోతే రాజ్యానికి వారసుడు ఉండడు కాబట్టి వెంటనే తనకి పెళ్లి చేయాలని అనుకున్నాడు.

అప్పుడే కాశిపట్నం రాజు తన కూతుర్ల కోసం స్వయంవరం ప్రకటించాడని తెలిసింది. విచిత్రవీరుడిని స్వయంవరానికి పంపిస్తే తన అనారోగ్యం కారణం వల్ల ఓడిపోతాడు. ఇక మనకు మిగిలింది ఒకటే దారి అని స్వయంవరం జరిగేటప్పుడు మధ్యలో భీష్ముడు ప్రవేశించి అక్కడే పోరాటం చేసి కాశీ మహారాజు యొక్క ముగ్గురు కూతుళ్ళను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు.


ఆ ముగ్గురి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. కానీ అప్పటికే వీరిలో ఒకరైన అంబ వేరే రాజ్యానికి చెందిన సార్వా అనే రాజును ప్రేమించింది. ఈ విషయం అంబ భీష్ముడికి చెప్తే ప్రేమించే వారిని విడదీసేంత నీతి లేని వాణ్ణి కాదు నేను. ఇక నీకు స్వేచ్చ ఇస్తున్నాను నువ్వు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని పంపించేశాడు.

మిగిలిన అంబిక, అంబాలికలను విచిత్రవీరుడుకి ఇచ్చి పెళ్లి చేశాడు. వెయ్యి ఆశలతో ఎంతో సంతోషంతో సార్వుడి దగ్గరకు వెళ్లింది అంబ. ఇక మనం పెళ్లి చేసుకుందాం అని సార్వుడితో అంది. దానికి సార్వుడు నన్ను క్షమించు అంబ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను ఒకరు నిన్ను ఎత్తుకెళ్లిన తరువాత నిన్ను నా పట్టప్రాణిగా నా రాజ్యానికి రాణిగా నిన్ను ఉంచలేను. దానికి నా మంత్రులు గాని, నా ప్రజలు గాని ఒప్పుకోరు. ఎప్పుడైతే నిన్ను భీష్ముడు ఎత్తుకెళ్ళాడో అప్పుడే నువ్వు తన స్వంతం అని సార్వుడు అంబను తిరస్కరించాడు.

ఆశలన్నీ వెయ్యి ముక్కలు అయ్యి ఏం చేయాలో తెలియక ఇక వెనుతిరిగి భీష్ముడి వద్దకు వచ్చింది. సార్వుడు తనను తిరస్కరించిన విషయం భీష్ముడితో చెప్పి నన్ను నువ్వే పెళ్లి చేసుకోవాలని అంబ అంటుంది. దానికి భీష్ముడు, ఇప్పటికే అంబికా, అంబాలికలతో విచిత్రవీరుడుకి పెళ్లయిపోయింది. తన ఆరోగ్యం బాగా లేనందున విచిత్రవీరుడుకి నిన్ను ఇచ్చి పెళ్ళి చేయలేను. అలాగని నేను చేసిన ప్రతిజ్ఞ వల్ల నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను, పిల్లల్ని కనలేను అని భీష్ముడు అన్నాడు.


అప్పుడు అంబ, నా రాజ్యం పైన దాడి చేసి నన్ను తల్లిదండ్రుల నుంచి ఎత్తుకొచ్చావు, ప్రేమించిన వాడే నన్ను తిరస్కరించేలా చేశావు, పోనీ నువ్వైనా చేరదీస్తావనుకుంటే నువ్వు కూడా చేసుకోను అంటున్నావు. ఒక ఆడదాని ఉసురు పోసుకుని నువ్వూ నీ రాజ్యం ఏం సుఖపడుతుంది, ఎలా సంతోషంగా ఉంటుంది. నువ్వు భీష్మ ప్రతిజ్ఞ ఎలా చేశావో, నేనూ ప్రతిజ్ఞ చేస్తున్నాను నీకు చావు అనేది రాదు అని సంబరపడిపోతున్నావు కదా, ఏనాటికైనా నీ చావుకి కారణం నేనే అవుతాను అని ప్రతిజ్ఞ చేసి అంబ అడవుల్లోకి వెళ్లిపోతుంది.

భీష్ముడికి బాధగా ఉన్నా తను చేసిన ప్రతిజ్ఞ వల్ల, బాధ్యతల వల్ల ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాడు. ఇంతలో విచిత్రవీరుడు అనారోగ్యం ముదిరిపోయి మరణించాడు. అంబిక, అంబాలికలు విధవలు అయ్యారు. ఇక రాజ్యానికి రాజు లేడు, వారసుడు లేడు. రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది. మంత్రులంతా నేను రాజును అవుతానంటే నేను రాజునవుతాను అని సంక్షోభ స్థితిలో ఉన్నారు.

ఇలాగే వదిలేస్తే కేవలం కొన్ని రోజుల్లోనే రాజ్యం పతనం అవుతుంది. ఇదే అదునుగా తీసుకొని పక్క రాజ్యం రాజులు మన రాజ్యంపై దండెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చక్కబడాలంటే దానికి ఒకటే మార్గం వారసుడు పుట్టాలి. దానికి ఏం చేయాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని సత్యవతి భీష్ముడిని పిలిపించి, భీష్మ ప్రస్తుత పరిస్థితులు నీకు తెలుసు. ఇప్పుడు ఉన్నది ఒకటే మార్గం నువ్వు నీ తమ్ముడు భార్యలైన అంబిక, అంబాలికలతో సంగమించి వారసుడ్ని ప్రసాదించు అని అడిగింది.

అపుడు భీష్ముడు నేను ప్రతిజ్ఞకి కట్టుబడి ఉన్నాను నేను ఆ పని చేయలేను అని భీష్ముడు అన్నాడు. దానికి సత్యవతి నువ్వు ప్రతిజ్ఞ చేసింది నా కోసమే కదా మరి నేనే అడుగుతున్నాను కదా అని సత్యవతి అంది. దానికి భీష్ముడు నేను ప్రతిజ్ఞ చేసింది నీ కోసమే కావచ్చు కానీ నేను ప్రతిజ్ఞ చేసింది నా మాట నేను తప్పకూడదని. నేను వేసుకున్న మాటని నేనే తప్పితే ఇక నాకేం అర్థం ఉంటుంది అని సత్యవతి చెప్పిన పనికి ఒప్పుకోడు.


అప్పుడు సత్యవతి, సరే ఇక మిగిలింది ఒక్కటే మార్గం, నేను నా మనసులో ఎప్పటినుంచో దాచిన రహస్యం నీకు చెప్పాల్సిన సమయం వచ్చింది. అని చెప్పింది నేను నీ తండ్రి ని పెళ్లి చేసుకోక ముందే పరాశరుడు అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు పుట్టాడు. పెళ్లి కాకుండానే పుట్టిన కొడుకు కాబట్టి నేనే పెంచుకుంటానని పరాశరుడు తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ కొడుకు పెద్ద వాడు అయ్యాడు అతని పేరు పేరు వ్యాసుడు. నువ్వు వెళ్ళి వ్యాసుడిని తీసుకొని రా అని చెప్పి పంపింది. ఆ వ్యాసుడు రాసిన కథే ఈ మహాభారతం.

వ్యాసుడిని మించిన గొప్ప కవి ఈ ప్రపంచంలోనే లేడు. ఎందుకంటే వ్యాసుడు రాసిన మహాభారతం కు మించిన మించిన కథ ఏ భాషలో గాని, ఏ దేశంలో గాని లేదు.
భీష్ముడు వ్యాసుని కలిశాడు, వ్యాసుడు, భీష్ముడు మొదటి సారి కలుసుకున్నప్పుడు వారిద్దరూ ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ని కలుసుకున్నప్పుడు తమ మనసులో ఒక గొప్ప వ్యక్తిని కలిసాం అనే భావన కలుగుతుంది.

భీష్ముడు వ్యాసుడుని తన రాజ్యానికి తీసుకొచ్చాడు. వ్యాసుని చూసి సత్యవతి ఎంతో సంతోషించి వ్యాసుడికి ప్రస్తుత పరిస్థితి అంతా వివరించింది. అంబిక, అంబాలికలతో సంగమించి పిల్లల్ని కనమని చెప్పింది. అప్పుడు వ్యాసుడు అమ్మా నేను ఆజన్మ బ్రహ్మచారిని కానీ తల్లి మాట వినడం ధర్మం కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటాను అని అన్నాడు.

ఇక్కడ మనం గమనిస్తేతల్లి మాట కోసం తను వేసుకున్న మాట ధర్మం అని భీష్ముడు అనుకున్నాడు. తను వేసుకున్న మాటకంటే తల్లి మాట వినడం ధర్మం అని వ్యాసుడు అనుకున్నాడు. మీరే చెప్పండి ఏది నిజం... అందుకే ప్రతి మనిషికి వారి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక నిజం ఉంటుంది. అందుకని మంచి, చెడు అనేవి పరిస్థితుల్లో ఉంటాయి గాని మనుషుల్లో ఎప్పుడూ ఉండవు.

తన తల్లి చెప్పినందుకు వ్యాసుడు తన తల్లితో అమ్మ నేను వారితో సంగమించను కానీ నా తపోశక్తితో వారి కడుపులో పిల్లలు పుట్టేలా చేస్తానని చెప్పి రెండు సర్కిల్స్ ఎదురెదురుగా గీసి ఒక సర్కిల్లో వ్యాసుడు కూర్చొని ఎదురుగా ఉన్న సర్కల్ లో అంబికను కూర్చోమని చెప్పాడు.

తన తపోశక్తిలో ఉన్నప్పుడు, వ్యాసుడు అడవుల్లో ఉంటాడు కాబట్టి తన భయంకరమైన ఆకారం, ఒళ్లంతా వెంట్రుకలతో ఉంటాడు. అందుకని వ్యాసుడుని చూసి అంబిక భయంతో కళ్లు మూసుకుంటుంది. నేను తపస్సు లో ఉన్నప్పుడు అంబిక కళ్లుమూసుకుంది కాబట్టి ఆమె కడుపున ఒక గుడ్డివాడు పుడతాడు అని సత్యవతితో అన్నాడు. అలా గుడ్డివాడిగా పుట్టింది ధృతరాష్ట్రుడు. గుడ్డివాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడా... అయితే మరో వారసుడుని ప్రసాదించమని ఈసారి అంబాలికని వ్యాసుని దగ్గరికి పంపించింది.

ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూసుకోవద్దని సత్యవతి ముందే చెప్పి పంపించింది. కానీ అంబాలిక వ్యాసుని చూస్తూ మామూలుగా ఉండలేక పోయింది. ఆయన భయంకరమైన ఆకారం చూస్తూ భయపడి వణుకుతూ ఉంది. నేను తపస్సులో ఉన్నపుడు ఈమె వణికినందున ఈమె కడుపులో వణుకుడు రోగం గల పాండురోగం ఉన్నవాడు పుడతాడని వ్యాసుడు అన్నాడు. అలా పుట్టిన వాడే పాండురాజు.

సత్యవతి ఇంకా తృప్తి కలగక ఈసారి వణకవద్దు అని చెప్పి అంబాలికను మరలా వ్యాసుడి దగ్గరకు పంపింది. కానీ అంబాలికకి భయం వేసి తన స్థానంలో ఒక దాసిని పంపించింది. కానీ ఆ దాసి భయపడకుండా సంతోషంగా కూర్చుంది. ప్రేమతో నా బిడ్డకు జన్మనివ్వు అని ఎదురుగా కూర్చున్న దాసిని చూసి సంతోషించి వ్యాసుడు ఆమెకి కూడా గర్భధారణ ప్రసాదించాడు. అలా దాసికి విధురుడు జన్మించాడు.

అంబికకు పుట్టినది ధృతరాష్ట్రుడు, ఇతను గుడ్డివాడు కానీ అత్యంత శక్తివంతుడు, హస్తినాపుర రాజ్యానికి మొదట రాజయ్యే అవకాశం ఇతనికే ఉంది. అంబాలికకు పుట్టింది పాండు రాజు, ఇతను శారీరకంగా శక్తివంతుడు కాదు కానీ యుద్ధ విద్యల్లో మాత్రం ఆరితేరుతాడు. దాసి కి పుట్టిన వాడు విదురుడు అతను బలవంతుడు తెలివైనవాడు హస్తినాపురం భవిష్యత్తు ఈ ముగ్గురి వల్లే మారబోతుంది ఈ ముగ్గురు అంటే భీష్ముడికి అత్యంత ఇష్టం. వీరిని చాలా గారాబంగా పెంచుతాడు వాళ్లకి యుద్ధవిద్యలు అస్త్రవిద్యలు వేదాలు నీతి శాస్త్రాలు అన్ని నేర్పించాడు.

వీరి ముగ్గురి వలన మహాభారతంలో ఎటువంటి మలుపులు తిరిగాయో మరియు పాండవులు, కౌరవులు ఎలా జన్మించారు అనేది నెక్స్ట్ పార్ట్ లో వివరించడం జరిగింది.

 ఆ తరువాత ఏం జరిగిందో తరువాతి పార్ట్ లో ఉంటుంది. Next part కావాలంటే మాకు Mail చేేేయండి. మా Mail Id : teluguarrow59@gmail.com

Subscribe పైన క్లిక్ చేసి ఫాలో అవ్వ గలరని మనవి. థాంక్యూ వెరీ మచ్ సర్/మేమ్.